Tuesday, 25 April 2017

వెన్నెల కలం రాసిన ఆకుపచ్చని రచన!

ర్శకుడు వంశీ గారి పోస్టు పుణ్యమా అని బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ నవల ‘వనవాసి’ చదివాను. నిజానికి చదివాను అనడం కన్నా ..ఆ విముక్తాకాశాన్ని ఆ స్వచ్ఛంద విహారాన్ని అడుగడుగునా పరుచుకునే ఆ వెన్నెల రాత్రుల్ని, ఆ వన కుసుమ పరిమళాన్ని, ఆ సరస్వతీ హ్రద విలాసాల్ని అనుభవించాననడం బాగుంటుందేమో!

నిమిత్త మాత్రుడైనప్పటికీ రచయిత అన్ని వేల బిఘాల అరణ్యభూముల్ని ధారాదత్తం చేసి అడవిని నాశనం  చేసినందుకు వ్యథ కలుగుతుంది. (కథను చెప్పే పాత్ర... సత్య చరణ్ రచయితే అని నా అభిప్రాయం). నిజానికి సత్యచరణ్ కి కూడా తనమీద తనకే కోపం రాకపోతే ఈ నవల పుట్టేది కాదు కదా !

ప్రసిద్ధ నవల, సినిమా ‘పథేర్ పాంచాలి’ నవలా రచయితగా ఎంతో గుర్తింపు పొందిన బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ డెబ్భై ఏళ్ళ కిందట రాసిన నవల ‘వనవాసి’. ‘ఆరణ్యకి’గా బెంగాలీలో పేరొందిన ఈ నవలని సూరంపూడి సీతారాం గారు సరళ సుందరంగా తెలుగులోకి అనువదించారు.   ఈ నవల మొదటి ముద్రణ 1961లో!
బెంగాలీ నవల ముఖచిత్రం

ఇందులో కథ కన్నా పచ్చని ప్రకృతి ధ్వంసమైపోతుందనే వ్యథ ఎక్కువ. ముందుమాటలో చెప్పినట్లు వంద సంవత్సరాల క్రితం భారత భూభాగంలో 40 శాతం ఉన్న అడవులు 1997 నాటికి 19 శాతం అయినాయి. ఇంకా ఈ 20 సం. కాలంలో ఇంకెంతకు చేరినాయో సర్వేలే చెప్పాలి. అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగుతున్నాయనేది కాదనలేని సత్యం! రోజురోజుకీ తీవ్రమైన ఎండలతో, జలసమస్యలతో అల్లాడుతున్న ఈ రోజుల్లో ఈ నవల ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన నవల!

కథలో ఇతివృత్తం
ఉన్నత విద్యావంతుడైన చిరుద్యోగి సత్య చరణ్ దాన్ని కూడా పోగొట్టుకుని రోజులు భారంగా గడుపుతున్న తరుణంలో కళాశాల మిత్రుడు సంపన్నుడు అవినాశ్ కుశీనదీ తీరాన బీహార్ లోని పూర్ణియా జిల్లాలోని దట్టమైన అరణ్యంలో 30 వేల బిఘాల అడవి (అంటే 40 సెంట్ల భూమి)ని సాగుకు కౌలుదార్లను ఏర్పాటుచేసే, పంచిపెట్టే పని మీద ఉద్యోగం ఇస్తాడు. ఈ కర్తవ్య నిర్వహణలో 6 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఆ అటవీ సౌందర్యాన్ని, ఆటవికుల జీవనాన్ని, వారి దారిద్ర్యాన్ని అన్నీ తెలుసుకుంటాడు. తన కర్తవ్యం ముగియగానే తిరిగి వెళ్ళిపోతూ, లవలుటియా నాఢా అరణ్య సౌందర్య సౌభాగ్యాలని చేతులారా నాశనం చేసినందుకు (జమీందార్ల పురమాయింపు వలన ఉద్యోగ ధర్మంగా) పశ్చాత్తాపంగా ‘చేసిన పాపం చెప్తే పోతుందంటారు’ కాట్టి తన అనుభవాల్ని, అనుభూతుల్ని తానే ఈ నవలలో చెప్పుకుంటూపోతాడు. అదీ కథ!

అద్భుత వర్ణనలు
ఈ నవలలోని అరణ్య వర్ణనలు మననో అద్భుత లోకానికి తీసుకువెళ్తాయి.

‘అడవి గాచే వెన్నెల’ ఎంతందంగా ఉంటుందంటే- ‘అటువంటి వెన్నెల రాత్రిని జీవితంలో ఒక్కసారైనా చూడటం ఉచితం. అలా చూడనివారికి ఈశ్వర సృష్టిలోని ఒకానొక సౌందర్యానుభూతి నష్టమైపోయిందన్నమాటే’.








 అడవిలోని ఏ రుతువూ, ఏ అందమూ రచయిత దృష్టిని దాటిపోలేదు!

‘అపూర్వ రక్తారుణ రాగరంజిత సంధ్యలూ
ఉన్మాదిని అయిన భైరవి లాంటి మధ్యాహ్నాలు
శిఖిశిఖా ఖడ్గం చేతబూని దిఙ్మండలమంతా
వ్యాపించిన కాళీమూర్తి వంటి కాళ నిశీధునులు
శిరస్సుపై నక్షత్రాలు పొదిగిన ఆకాశం
పసిబిడ్డలా అమాయకంగా కళ్ళలోకి కళ్ళుపెట్టి ఆశ్చర్యంగా చూసే లేడిపిల్ల’

ఇవి కాక అడవిపూల సోయగాలు, వాటి పరిమళాలు ఎంత చెప్పినా తక్కువే. 


 








ఎన్నెన్ని పూలు! 
మాధవీ పుష్పాలు, స్పైడర్ లిల్లీలు, శేఫాలికలు, మోదుగలు, గోల్ గోలీలు, భండీర, సప్తపర్ణి .. ఇలా అనేక పుష్పాలు.

ఇక అడవి పక్షులు, పచ్చపిట్టలు, శ్యామ పక్షులు, పాల పిట్టలు, గోరింకలు, పిచ్చుకలు, అడవి పావురాలు, వాటి రమణీయ సంగీతం, ఒకోసారి రణగొణ ధ్వని కూడా!

అంతేనా! క్రూర మృగాలు, వాటితో కూడిన ఆరణ్యక భయద సౌందర్యం!

గుఱ్ఱపు స్వారీ ఎరుగని సత్యచరణ్ బాబు అల్పకాలంలోనే గుఱ్ఱపు స్వారీ నేర్చుకుని దట్టమైన అరణ్యంలోకి నిర్భయంగా స్వేచ్ఛగా సంచరిస్తూ అరణ్య రామణీయకతను తనివి తీరా ఆస్వాదించడమే గాక మనకూ అందిస్తాడు.

మనసుకు హత్తుకుపోయే మనుషులు-వారి మమతలు
ఈ అడవి ప్రజకి అన్నం అంటే జమీందార్ల భోజనమే.  ఎప్పుడో సంవత్సరానికొకసారి ఏ పర్వ దినాలలోనో ధనవంతులు పెట్టే భోజనాలలోనే అన్నం కనపడేది!  మేనేజర్ బాబు వచ్చారని అన్నం వండుతారని ఆ అన్నం కోసం  10, 15 మైళ్ళ దూరం నడిచివచ్చే ఆ దీన జనులను గురించి చదువుతుంటే కళ్ళు చెమర్చుతాయి. పచ్చి మినపపిండి, మహా అయితే కొర్ర అన్నం! అదే వారికి ఆహారం.

ఆరణాల ఇత్తడి గిన్నె కోసం సిపాయి మునేశ్వర్ సింగ్ ఎంత ప్రాధేయపడతాడో! రేగుపళ్ళు ఏరుకున్న పాపానికి రాజపుత్ర వితంతు వధువు, దీనురాలు కుంత ఎన్ని దెబ్బలు తింటుందో. బతుకుతెరువు కోసం 60 -70 ఏళ్ళ వయసులో చిన్నికృష్ణునిలా వెన్నకోసం ముద్దులు గునుస్తూ నాట్యమాడే దశరథ్ నవ్వు తెప్పించే హావభావాలు. నాట్యమంటే ప్రాణమిచ్చే ధాతురియా గిరగిర నృత్యం,  అతని విషాదాంత మరణం, సంవత్సరమంతా కష్టపడి పండించిన పంటని పూసల దండలకూ, తల పిన్నులకూ అమాయకంగా ధారపోసే నక్ ఛేదీ రెండో భార్య మంచీ! కలరా సోకినప్పుడు నిర్భయంగా సేవ చేసే రాజు పాండే, వృద్ధ భర్త కలరాతో మృత్యుశయ్యగా ఉండగా 15, 16 ఏళ్ళ అతని మూడో భార్య దాచుకున్న ఈగలు వాలుతున్న నాలుగు మెతుకుల అన్నం... అది తినొద్దని నివారించిన సత్య చరణ్ వైపు ఆమె చూసే జాలి చూపులు... చివరకు ఆమె కూడా కలరాతో మరణించాక అపురూపమైన రెండు అన్నం మెతుకులు ఆమెను తిననీయలేదే అని రచయిత పడే ఆవేదన కంటనీరు తెప్పిస్తాయి.

ఈ నవలలో అందరికన్నా ఒక విచిత్ర వ్యక్తి యుగళ ప్రసాద్. చిరుద్యోగి. ఎక్కడెక్కడినుంచో అందమైన లతలూ విత్తనాలూ తెచ్చి అడవిలో పలుచోట్ల ముఖ్యంగా సరస్వతీ హ్రదం వద్ద నాటుతుంటాడు. ఏమీ ఆశించకుండా అటవీ సౌందర్యం పెంచటానికే అతడు అలా చేస్తాడు. ఈనాటి స్వార్థ సమాజంలో అటువంటి వ్యక్తి మన ఊహలకు కూడా అందడు.

అలాగే 1862 నాటి సంతాలు తిరుగుబాటు నాయకుడు, ఈ అడవికి తరతరాల వారసత్వపు రాజు అయిన  దోబ్రూపన్నా, అతని మనుమరాలు రాజకుమార్తె భానుమతి. ఏ ఆస్తీ లేకపోయినా రాజదర్పం పోని కుటుంబం. ముఖ్యంగా భానుమతి రూపం, హృదయం కూడా నిసర్గ సుందరం. అమాయకురాలైన ఆమె తమ అడవి లాంటి అడవి ఎక్కడా లేదంటూనే భారతదేశం అంటే ఎక్కడ ఉంటుంది అని అమాయకంగా ప్రశ్నిస్తుంది. 

గంగోతాల దీన జీవనం, వారి  అమాయకత్వం, కష్టపడే మనస్తత్వం, ప్రమాదాల మధ్య కూడా సంతృప్తిగా జీవించే వారి తత్వం... నవల ముగిసినా మన హృదయాల్ని వదిలిపోవు!

ముఖ్యమైన ప్రశ్న
ఆరు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగివెళ్ళేటప్పుడు తన వల్ల అంతరించిన అరణ్యాన్ని తలచుకుని పశ్చాత్తాపపడి సత్య చరణ్ - ‘మనిషికి కావలసినదేమిటి? అభివృద్ధా? ఆనందమా? బలభద్ర సెంగాత్, రాస బిహారీ సింగ్ వంటి సంపన్నులు ఉన్నతిని సాధించుకోనీ!  దానివల్ల ఆనందం రాకపోతే ఏం ప్రయోజనం?’ అనే మీమాంసలో పడతాడు.

ఏదిఏమైనా అమాయక గిరిజనులు, వారి జీవనం, అద్భుతమైన అటవీ సౌందర్యం నవల ముగిసినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

రొటీన్ లో విసిగిపోయిన రోబోట్ జీవితాలకు వెన్నెల స్నానం చేయించే అందమైన నవల ఇది.

అటు సమాజ ప్రయోజనం, ఇటు సౌందర్య శిల్పం కలగలిసిన అక్షర నీరాజనం ‘వనవాసి’ నవల!

(బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు  బెంగాలీ నవల్లో ఉపయోగించినవే.  ఈ  నవల్లో చిత్రితమైన వివిధ రకాల పూల చిత్రాలు  ఇంటర్ నెట్  సౌజన్యంతో..)

Thursday, 5 January 2017

అమృతానుభూతి పంచిన కథ.. ‘మిథునం’!

విజయవాడ పుస్తక మహోత్సవం పుస్తక ప్రియులకు పండుగే మరి! 

శ్రీ రమణ గారి ‘మిథునం’ కూడా కొన్నాను! 

చలన చిత్రం చాలామంది చూసే వుంటారు!  


అయినా బాపుగారి దస్తూరీ తిలకాన్ని బొట్టెట్టుకున్న ఆ పుస్తకం ఎంత ముద్దుగా వుందో! 

మనసులు కలవడానికి అడ్డొచ్చే దేన్నో . . . వేటినో . . చెరిగేసి . . . వాక్కు-  అర్థంలా దంపతులు ఎలా కలిసి జీవించాలో . . బుచ్చిలక్ష్మి చేతి వంటంత కమ్మగా చెప్పిన రచన! 

నేనైతే . . . 
మురిసిపోతూ . . . 
నవ్వుకుంటూ . . 
ఆనందపడుతూ . . 

చివరికొచ్చేసరికి . . . 
చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ . . . 
ఒక అమృతానుభూతికి లోనయ్యాను!

అడుగడుగునా హాస్యాన్ని రంగరిస్తూ . . . చవులూరించే . . తెలుగువారివంటలనీ . . భోజన ప్రియత్వాన్ని . . . . అరిటిచెట్టు లేత కొసాకులో . . వండి వడ్డించిందీ రచన!

మచ్చుకి కొన్ని ఉదాహరణలు!
ధప్పళం . . . అంటే "పులుసు" అని తెలుసు కదా!
పులుసు కాగినకొద్దీ . . రుచి అంటారు!

అప్పదాసు మాటల్లో . . . 
‘ఆగు! ధప్పళం తెర్లుతుంటే . . . క్షీర సాగర మథనంలా కోలాహలంగా వుండవలె!
పోపు పడితే . . . . తొలకరిలా ఉరిమి . . . రాచిప్పలో
ఉప్పెన రావలె! " 

అది వంటైనా . . స్నానమైనా . పనైనా . . . ఆస్వాదించే . . . కళ . . . అవసరం! 

అయిదుగురు మగపిల్లలు పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో . . ఎక్కడెక్కడో వున్నారు! 
ఈ దంపతులు మాత్రం వాళ్ళు పెంచుకునే పెరటి చెట్లకి . కొడుకుల పేర్లు పెట్టుకొని ఆప్యాయంగా పిలుచుకుంటారు!

జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో . . జీవించడం మర్చిపోయిన . . . ప్రతి ఒక్కరూ . చదవాల్సిన రచన!
కొన్ని అందమైన వర్ణనలు!
. . . . . . . . . . . . . . . . .
‘‘అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ పసిపిల్లల్లా అరటి పిలకలు!
వాటినీడన అల్లం మోసులూ . . 
పక్క పక్కనే వున్నా అంటీ అంటనట్లుండే తోడికోడళ్ళలా దబ్బ దానిమ్మలూ!
కొబ్బరి తురిమి ఆరబోసినట్లు వెన్నెల!’’

అసలు వీళ్ళ దాంపత్యాన్ని చూసి . . . మనకు చెప్పే 
Third person అదృష్టానికి అసూయ కలుగుతుంది!

ఈ మేనల్లుడనే సదరు వ్యక్తి పాలుపోసే మిషతో . . 
రెండు పూటలా వస్తుంటాడు!
వాడితో  అప్పదాసు . . ‘‘ఏమోయ్! మాలేడీసుకి తలదువ్వి జడేస్తున్నానని వూరంతా టాం టాం వేస్తున్నావట! ’’

‘‘అది సరే గానీ వీపురుద్ది నీళ్ళుపోస్తాడనిగానీ చెప్పేవ్?’’- అనేమాట బుచ్చిలక్ష్మి ది!

శ్రీ రమణ మార్కు హాస్యం కడుపుబ్బ నవ్విస్తుంది!

దాక్షారం సంబంధం చేసుకుంటేనా! అనే బుచ్చిమాటకి మూలిక చూపించిన పాములా ముడుచుకుపోయే అప్పదాసు అసలా సంబంధమేలేదని . . ఉత్తదేనని తెలిసి . . . హాయిగా కన్నుమూయడం కొసమెరుపు!

‘‘భగవంతుడా! నేను పోతే నాలా ఎవరు చూస్తారీ మనిషిని! ఆయనను నాకన్నా ముందు తీసుకుపొమ్మ’’ని ప్రార్థించే ప్రేమ ఆమెది!

ఎంతో చక్కటి రచన!