విజయవాడ పుస్తక మహోత్సవం పుస్తక ప్రియులకు పండుగే మరి!
శ్రీ రమణ గారి ‘మిథునం’ కూడా కొన్నాను!
చలన చిత్రం చాలామంది చూసే వుంటారు!
అయినా బాపుగారి దస్తూరీ తిలకాన్ని బొట్టెట్టుకున్న ఆ పుస్తకం ఎంత ముద్దుగా వుందో!
మనసులు కలవడానికి అడ్డొచ్చే దేన్నో . . . వేటినో . . చెరిగేసి . . . వాక్కు- అర్థంలా దంపతులు ఎలా కలిసి జీవించాలో . . బుచ్చిలక్ష్మి చేతి వంటంత కమ్మగా చెప్పిన రచన!
నేనైతే . . .
మురిసిపోతూ . . .
నవ్వుకుంటూ . .
ఆనందపడుతూ . .
చివరికొచ్చేసరికి . . .
చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ . . .
ఒక అమృతానుభూతికి లోనయ్యాను!
అడుగడుగునా హాస్యాన్ని రంగరిస్తూ . . . చవులూరించే . . తెలుగువారివంటలనీ . . భోజన ప్రియత్వాన్ని . . . . అరిటిచెట్టు లేత కొసాకులో . . వండి వడ్డించిందీ రచన!
మచ్చుకి కొన్ని ఉదాహరణలు!
ధప్పళం . . . అంటే "పులుసు" అని తెలుసు కదా!
పులుసు కాగినకొద్దీ . . రుచి అంటారు!
అప్పదాసు మాటల్లో . . .
‘‘ఆగు! ధప్పళం తెర్లుతుంటే . . . క్షీర సాగర మథనంలా కోలాహలంగా వుండవలె!
పోపు పడితే . . . . తొలకరిలా ఉరిమి . . . రాచిప్పలో
ఉప్పెన రావలె! "
అది వంటైనా . . స్నానమైనా . పనైనా . . . ఆస్వాదించే . . . కళ . . . అవసరం!
అయిదుగురు మగపిల్లలు పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో . . ఎక్కడెక్కడో వున్నారు!
ఈ దంపతులు మాత్రం వాళ్ళు పెంచుకునే పెరటి చెట్లకి . కొడుకుల పేర్లు పెట్టుకొని ఆప్యాయంగా పిలుచుకుంటారు!
జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో . . జీవించడం మర్చిపోయిన . . . ప్రతి ఒక్కరూ . చదవాల్సిన రచన!
కొన్ని అందమైన వర్ణనలు!
. . . . . . . . . . . . . . . . .
‘‘అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ పసిపిల్లల్లా అరటి పిలకలు!
వాటినీడన అల్లం మోసులూ . .
పక్క పక్కనే వున్నా అంటీ అంటనట్లుండే తోడికోడళ్ళలా దబ్బ దానిమ్మలూ!
కొబ్బరి తురిమి ఆరబోసినట్లు వెన్నెల!’’
అసలు వీళ్ళ దాంపత్యాన్ని చూసి . . . మనకు చెప్పే
Third person అదృష్టానికి అసూయ కలుగుతుంది!
ఈ మేనల్లుడనే సదరు వ్యక్తి పాలుపోసే మిషతో . .
రెండు పూటలా వస్తుంటాడు!
వాడితో అప్పదాసు . . ‘‘ఏమోయ్! మాలేడీసుకి తలదువ్వి జడేస్తున్నానని వూరంతా టాం టాం వేస్తున్నావట! ’’
‘‘అది సరే గానీ వీపురుద్ది నీళ్ళుపోస్తాడనిగానీ చెప్పేవ్?’’- అనేమాట బుచ్చిలక్ష్మి ది!
శ్రీ రమణ మార్కు హాస్యం కడుపుబ్బ నవ్విస్తుంది!
దాక్షారం సంబంధం చేసుకుంటేనా! అనే బుచ్చిమాటకి మూలిక చూపించిన పాములా ముడుచుకుపోయే అప్పదాసు అసలా సంబంధమేలేదని . . ఉత్తదేనని తెలిసి . . . హాయిగా కన్నుమూయడం కొసమెరుపు!
‘‘భగవంతుడా! నేను పోతే నాలా ఎవరు చూస్తారీ మనిషిని! ఆయనను నాకన్నా ముందు తీసుకుపొమ్మ’’ని ప్రార్థించే ప్రేమ ఆమెది!
ఎంతో చక్కటి రచన!